Google: గూగుల్ బెదిరిస్తోంది.. విచారణను అడ్డుకునే ప్రయత్నాలు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సీసీఐ
- మీడియా లీక్ చేస్తే.. మీడియాపై దావా వేయాలి
- మేము లీక్ చేసినట్టు ఆధారాలేంటి?
- గూగుల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
కోర్టు విచారణలకు అడ్డంకులు సృష్టించేలా గూగుల్ తమను బెదిరిస్తోందని ఢిల్లీ హైకోర్టుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలియజేసింది. రహస్యంగా ఉంచాల్సిన నివేదికలోని అంశాలను సీసీఐ లీక్ చేసిందని ఆరోపిస్తూ హైకోర్టులో గూగుల్ పిటిషన్ దాఖలు చేసింది. ‘భారీ అర్థ బలం’తో భారత్ లోని ఇతర సంస్థలను విచ్ఛిన్నం చేస్తూ భారత్ లో గూగుల్ తనకు పోటీ లేకుండా చేసుకుంటోందని సీసీఐ రిపోర్టులోని అంశాలను ప్రస్తావిస్తూ రాయిటర్స్ రాసిన కథనం ఆధారంగా గూగుల్ ఈ వ్యాజ్యం వేసింది.
అయితే, దీనిపై సీసీఐ దీటుగా స్పందించింది. కోర్టుకీడుస్తామని బెదిరిస్తూ కాలిఫోర్నియాలోని గూగుల్ సీనియర్ అధికారి ఒకరు సీసీఐ చైర్మన్ కు లేఖ పంపారని సీసీఐ వెల్లడించింది. మీడియా లీక్ చేస్తే.. ఆ సంస్థ మీద దావా వేయాలిగానీ, తమపై వేయడమేంటని కోర్టుకు వివరించింది. తమది ప్రభుత్వ సంస్థ అని, తామే రిపోర్ట్ ను లీక్ చేశామనడానికి ఆధారమేంటని ప్రశ్నించింది. గూగుల్ మీద జరుగుతున్న విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు, ఆ పిటిషన్ ను కొట్టేయించుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. మరో పది రోజుల్లో మేమే నివేదికను విడుదల చేస్తామని తెలిపింది.
అయితే, దీనిపై స్పందించిన గూగుల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకముందే మీడియాకు రిపోర్ట్ లీకైందని ఆరోపించారు. ఇటీవలి కాలంలో లీకులు ఎక్కువైపోయాయని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ రేఖా పల్లి.. తమ ఆదేశాలు కూడా అప్ లోడ్ కాకముందే అవి మీడియాలో వచ్చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. దాంతో పాటు రహస్యంగా ఉంచాలనే క్లాజ్ ఉంటే.. కచ్చితంగా దానిని రహస్యంగా ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, తాము నివేదికను లీక్ చేయలేదని సీసీఐ వివరణ ఇచ్చింది.