Bandi Sanjay: ఒకే ఫొటో ట్వీట్ చేసిన విజయసాయి, కేటీఆర్... 'జనాలు గుడ్డివాళ్లనుకుంటున్నారా?' అంటూ బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay ridicules Vijayasai and KTR tweets using with same photo

  • వ్యాక్సినేషన్ అంశంలో విజయసాయి, కేటీఆర్ ట్వీట్లు
  • ఆ ఫొటో తమ రాష్ట్రంలోనిదే అని పేర్కొన్న ఇద్దరు నేతలు
  • ఒకే సినిమా బోలెడు థియేటర్లలో ఆడినట్టుగా ఉందన్న సంజయ్
  • పొలాలను పోలిన పొలాలు అంటూ వ్యంగ్యం

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు పొలంలోకి వెళ్లి మరీ రైతులకు, రైతు కూలీలకు వ్యాక్సిన్ వేస్తున్న దృశ్యాలను ఆ ఫొటోలో చూడొచ్చు. అయితే ఆ ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ట్వీట్ చేశారు.

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతుందనడానికి ఈ ఫొటోనే నిదర్శనం అని విజయసాయిరెడ్డి, మా ఆరోగ్య శాఖ సిబ్బంది అంకితభావం చూడండి అంటూ కేటీఆర్ ఆ ఫొటోను పంచుకున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. "విజయసాయి, కేటీఆర్ ఇద్దరూ ఒకే ఫొటో పంచుకున్నారు, జనాలు మరీ ఇంత గుడ్డివాళ్లనుకుంటారో, ఏమో!" అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఈ మేరకు వాళ్లిద్దరూ చేసిన ట్వీట్లను బండి సంజయ్ పంచుకున్నారు.

"ప్రజారోగ్యం మీద తమ చిత్తశుద్ధిని నిరూపించాలని అనుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి... అసలైన చిత్తశుద్ధి చూపించడంలో లేదని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే సినిమా బోలెడు థియేటర్లలో ఆడినట్టు... ఈ ఒకట్రెండు ఫొటోలే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ షికారు చేస్తున్నాయి. ఇదిగో, పొలాల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్లు వేస్తున్న మా ప్రభుత్వ గొప్ప చూడండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్లు చేసుకుంటున్నారో చూడండి" అంటూ ఎద్దేవా చేశారు.

"అసలు కామెడీ ఏంటంటే... మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ... ఇలా పొలాల్ని పోలిన పొలాలు, రైతులను పోలిన రైతులు, నర్సులను పోలిన నర్సులు ఉంటారని ఇప్పుడు తెలుస్తోంది. వీళ్ల రాజకీయాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"కొసమెరుపు ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తుంటే ప్రచారం కోసం వీళ్లు పోటీ పడుతున్నారు" అంటూ బండి సంజయ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News