COVID19: కరోనా మూడో వేవ్ వచ్చినా.. తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం: సీఎస్ఐఆర్
- దేశంలో చాలా వరకు జనాభాకు ఒక డోసు టీకా
- భారత వ్యాక్సిన్లు మహమ్మారిని అధిక శాతం అడ్డుకుంటాయి
- వెల్లడించిన సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండే
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్‌లో కరోనా మూడో వేవ్ వచ్చే అకాశాలున్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకవేళ కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత అంత ఎక్కువగా ఉండబోదని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండే తెలిపారు.
‘‘దేశంలో అధిక శాతం జనాభాకు మనం కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించగలిగాం. చాలా మందికి రెండో డోసు కూడా అందింది. ఈ వైరస్‌ను మన వ్యాక్సిన్లు అధిక శాతం నిలువరిస్తున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా, వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో కరోనా మూడో వేవ్ ఒకవేళ వచ్చినా, రెండో వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది’’ అని శేఖర్ వివరించారు.
కాగా, దివ్యాంగులకు, అలాగే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేని వారికి ఇక నుంచి ఇంటి వద్దే వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్, ఈ ప్రకటన చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా, భారత్‌లో మూడో వేవ్ రావడం అనేది ప్రజలు పాటించే జాగ్రత్తలపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ సామిరన్ పండా ఇటీవల వెల్లడించారు. అలాగే ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మనీంద్ర అగ్రవాల్ మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ పుడితేనే దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.