World Health Organization: డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా మరోసారి టెడ్రోస్ పేరు!
- నామినేట్ చేసిన సభ్యదేశాలు ఫ్రాన్స్ జర్మనీ
- ప్రతిపాదన చేయని టెడ్రోస్ స్వదేశం ఇథియోపియా
- మే నెలలో జరిగే వార్షిక సదస్సులో ఎన్నికలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌గా టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో కొత్తగా చీఫ్ ఎవరవుతారా? అని అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో టెడ్రోస్‌ను మరోసారి డబ్ల్యూహెచ్‌వో చీఫ్ పదవిలో ఉంచాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ప్రతిపాదించాయి.
తమతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఈ ప్రతిపాదన చేస్తున్నాయని జర్మనీ, ఫ్రాన్స్ ప్రతినిధులు తెలిపారు. టెడ్రోస్ స్వదేశం అయిన ఇథియోపియా అతని పేరును ప్రతిపాదించకపోవడం గమనార్హం. ఇలా ఒక అభ్యర్థిని స్వదేశం నామినేట్ చేయకపోవడం ఇదే తొలిసారి. టెడ్రోస్ పదవీ కాలం ముగియనుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశంలో కొత్త చీఫ్ ఎన్నిక జరగనుంది.
ఈ సమావేశం వచ్చే ఏడాది మే నెలలో జరగనుంది. 2017లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన టెడ్రోస్ ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగుస్తుంది. అప్పుడు డబ్ల్యూహెచ్‌వో కొత్త డైరెక్టర్ జనరల్‌ను ఎన్నుకుంటారు.