Jagga Reddy: మేం అన్నదమ్ముల్లాంటి వాళ్లం... నిన్న మీడియాతో మాట్లాడడం తప్పే!: జగ్గారెడ్డి

Jaggareddy gives explanation on his comments
  • తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యాఖ్యల కలకలం
  • పీసీసీ చీఫ్ రేవంత్ పైనా విమర్శలు
  • సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం
  • జగ్గారెడ్డికి క్లాస్!
  • క్షమాపణలు చెప్పానన్న జగ్గారెడ్డి!
తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యాఖ్యల కలకలం సద్దుమణిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తూ, తమ వంటి నేతలను విస్మరిస్తున్నాడని, తనకు పార్టీలో మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని జగ్గారెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. గజ్వేల్ సభలో గీతారెడ్డి కారణంగా అవమానం ఎదురైందని అన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలనుకుంటే అడ్డుకునేదెవ్వరు? అంటూ తీవ్రస్వరం వినిపించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వెంటనే స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. నిన్న మీడియా ఎదుట తాను మాట్లాడడం తప్పేనని పేర్కొన్నారు. తాము అన్నదమ్ముల్లాంటివాళ్లమని, కలిసి మాట్లాడుకుంటాం, కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియా ఎదుట మాట్లాడవద్దని పార్టీ చెప్పిందని జగ్గారెడ్డి వెల్లడించారు. అందుకు తాను క్షమాపణలు చెప్పానని వివరించారు.

ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ, జగ్గారెడ్డికి, పీసీసీకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ వివాదం ఏర్పడిందని అన్నారు. ఇకపై సమాచార లోపం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Jagga Reddy
Revanth Reddy
TPCC
Telangana
Congress

More Telugu News