Anil Bosak: తండ్రి సైకిల్ పై బట్టలు అమ్మే నిరుపేద.. కొడుకు సివిల్స్ ర్యాంకర్ అయ్యాడు!

Son of a man who sells clothes on cycle ranks in UPSC Exam
  • సివిల్స్ పరీక్షల్లో 45వ ర్యాంక్ సాధించిన అనిల్ బోసక్
  • 2018లో ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టా పొందిన బోసక్
  • థర్డ్ అటెంప్ట్ లో సివిల్స్ ను క్రాక్ చేసిన అనిల్
అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి, ఘన విజయాలను సాధించడానికి పేదరికం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించే మరో ఉదాహరణ ఇది. నిన్న విడుదలైన సివిల్స్ 2020 ఫలితాల్లో బీహార్ కు చెందిన అనిల్ బోసక్ 45వ ర్యాంకును సాధించాడు. కిషన్ గంజ్ జిల్లాలో అత్యంత పేద కుటుంబంలో జన్మించిన అనిల్... అకుంఠిత దీక్షతో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు.

ఆయన తండ్రి బినోద్ బోసక్ ఇప్పటికీ సైకిల్ మీద బట్టలు పెట్టుకుని, అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుండటం గమనార్హం. తన కుమారుడు సాధించిన విజయంతో ఆయన ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. కొడుకు ఐఏఎస్ అయ్యాడనే భావోద్వేగంలో ఆనందబాష్పాలు కారుస్తున్నారు.

అనిల్ బోసక్ ఐఐటీ ఢిల్లీ నుంచి 2018లో పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. మూడో అటెంప్ట్ లో సివిల్స్ ను క్రాక్ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన తండ్రి బినోద్ బోసక్ మాట్లాడుతూ... "అనిల్ తొలుత ఐఐటీకి ఎంపికయ్యాడు. అప్పుడు మేమంతా చాలా సంతోషించాం. ఐఐటీ తర్వాత ఉద్యోగం చేస్తాడని అనుకున్నాం. అయితే తాను యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలనుకుంటున్నానని అనిల్ చెప్పాడు. అతని ఉపాధ్యాయుడు కూడా ఎంతో సహాయం చేశాడు. తొలుత అది నాకు చాలా కష్టమనిపించింది. అది ఒక కల వంటిది. నాకు ఏ మాత్రం చదువు లేదు. ఇప్పుడు మాకు చాలాం సంతోషంగా ఉంది. గత ఏడాది సివిల్స్ లో అనిల్ కు 616వ ర్యాంక్ వచ్చింది. అప్పుడు తాను మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని చెప్పాడు. ఇప్పుడు 45వ ర్యాంక్ సాధించాడు. ఇంత పెద్ద ర్యాంక్ సాధించడం మాకందరికీ సంబ్రమాశ్చర్యంగా ఉంది. నా కుమారుడు సాధించిన విజయం మొత్తం జిల్లాకే గర్వకారణం" అని చెప్పారు.
 
సివిల్స్ 2020 టాప్ ర్యాంక్ ను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన శుభమ్ కుమార్ సాధించడం గమనార్హం. ఈ పరీక్షలను మొత్తం 761 మంది క్లియర్ చేయగా... వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 13 మంది పురుషులు కాగా, 12 మంది మహిళలు కావడం గమనార్హం.
Anil Bosak
IAS Ranker
Bihar
UPSC 2020

More Telugu News