Pawan Kalyan: మోహన్ బాబు గారూ... చిత్ర పరిశ్రమను హింసించొద్దని మీ బంధువులకు చెప్పండి!: పవన్ కల్యాణ్
- హైదరాబాదులో రిపబ్లిక్ ప్రీరిలీజ్ వేడుక
- హాజరైన పవన్ కల్యాణ్
- మోహన్ బాబుకు హితవు పలికిన పవన్ కల్యాణ్
- మీకు బాధ్యత ఉందంటూ వ్యాఖ్యలు
సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ అనేక అంశాలపై తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడించారు. వైసీపీ వాళ్లు ఏపీలో థియేటర్లు మూసివేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు మాట్లాడాలని స్పష్టం చేశారు.
"మోహన్ బాబు గారూ... వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా... చిత్ర పరిశ్రమను హింసించొద్దని వాళ్లతో చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్ పై నిషేధం విధించుకోమని చెప్పండి. అతను, మీరు తేల్చుకోండి... కానీ చిత్ర పరిశ్రమ జోలికి రావొద్దని చెప్పండి మోహన్ బాబు గారూ! మీరొక మాజీ పార్లమెంటు సభ్యులు కూడా. మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇవాళ చిత్ర పరిశ్రమకు వర్తింపజేసిన నిబంధనలు రేపు మీ విద్యానికేతన్ విద్యాసంస్థకు కూడా వర్తింపజేసే ప్రమాదం ఉంది" అని స్పష్టం చేశారు.
ఇది తాను మోహన్ బాబు ఒక్కరికే కాకుండా అందరికీ చెబుతున్నానని, లేకపోతే రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతులా చంపేసుకున్నట్టువుతుందని అన్నారు.