Narendra Modi: రూ. 22 లక్షలు పెరిగి రూ. 3.07 కోట్లకు చేరిన మోదీ ఆస్తుల విలువ
- గతేడాది రూ. 2.85 కోట్లుగా ఉన్న మోదీ ఆస్తులు
- తాజా డిక్లరేషన్‌లో ఆస్తులు పేర్కొన్న మోదీ
- ప్రధాని అయిన తర్వాత ఆస్తులు కొనుగోలు చేయని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2020లో రూ. 2.85 కోట్లుగా ఉన్న ఆస్తులు రూ. 22 లక్షలు పెరిగి రూ. 3.07 కోట్లకు చేరాయి. మోదీ తన తాజా డిక్లరేషన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వేతనం రూపంలో వస్తున్న సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో పెట్టడం, వాటిపై వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా ఆయన ఆదాయం స్వల్పంగా పెరిగింది. ప్రధాని మోదీకి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో రూ. 8.9 లక్షలు, ఎల్ఐసీ పాలసీలు రూ. 1.5 లక్షలు, ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌లో రూ. 20 వేల పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్ స్టేట్‌బ్యాంకులో మోదీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్ము విలువే ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తోంది.
గతేడాది రూ. 1.6 కోట్లుగా ఉన్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 1.86 కోట్లకు చేరింది. మోదీకి సొంత వాహనం లేదు. ఆయన వద్ద రూ. 1.48 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. బ్యాంకులో నిల్వ రూ. 1.5 లక్షలు. నగదు రూపంలో రూ. 36 వేలు ఉన్నట్టు మోదీ తన డిక్లరేషన్‌లో తెలిపారు. 2014లో మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. 2002లో మోదీ కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ రూ. 1.1 కోట్లు. అయితే, ఇందులో మోదీ సహా మరో ముగ్గురికి వాటా ఉంది.