Hyderabad: హైదరాబాద్‌లో డ్రైనేజీ గుంతలో పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం 15 గంటలుగా గాలింపు.. గుంతలో అతడు పడిన వీడియో ఇదిగో
- నిన్న రాత్రి మణికొండలో ఘటన
- గాలిస్తోన్న రెండు బృందాలు
- షాద్ నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో పనిచేస్తోన్న బాధితుడు
హైదరాబాద్ నిన్న రాత్రి కురిసిన వర్షాలకు.. మణికొండలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. అతడి పేరు గోపిశెట్టి రజనీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అతడి ఇల్లు ఘటనాస్థలికి 50 మీటర్ల దూరంలోనే ఉంది. అతడు షాద్ నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
నిన్న రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంతను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో పడ్డాడు. అతడి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంటలుగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం నాలాలు కలిసే ప్రాంతంలో రజనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వద్ద కూడా మరో బృందం గాలిస్తోంది. కాగా, నిన్న రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.