Botsa Satyanarayana: వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్ కు ఎందుకు?: మంత్రి బొత్స మండిపాటు
- సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచుతున్నారు
- ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు
- సినీ పరిశ్రమలో ఉన్నది పవన్ కల్యాణ్ ఒక్కడే కాదు
- చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించవచ్చు
సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ రోజు బొత్స విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.... సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచి, ప్రజలపై భారం వేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు.
సినిమా టికెట్ల ధరల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. జీఎస్టీలాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే సర్కారు ఉద్దేశమని తెలిపారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లే అడిగారని చెప్పారు.
అసలు వాళ్లకి లేని బాధ పవన్ కల్యాణ్‌కు ఎందుకని బొత్స నిలదీశారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఉన్నది పవన్ కల్యాణ్ ఒక్కడే కాదని, చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించవచ్చని చెప్పారు. కాగా, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.