Somu Veerraju: గాడితప్పిన పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఏపీ ప్రభుత్వం భారత్ బంద్ కు మద్దతిస్తోంది: సోము వీర్రాజు
- రేపు భారత్ బంద్
- పిలుపునిచ్చిన విపక్షాలు, రైతు సంఘాలు
- అదే రోజున ఏపీ కార్మిక సంఘాల బంద్
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ బంద్
- మద్దతు ప్రకటించిన ఏపీ సర్కారు
సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విపక్షాలు, రైతు సంఘాలు ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు కూడా అదే రోజున బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో, బంద్ కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలపడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ సర్కారు భారత్ బంద్ కు మద్దతిస్తోందని ఆరోపించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ బంద్ ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానివి అవకాశవాద రాజకీయాలు అని ఆగ్రహం వెలిబుచ్చారు.
సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాలు బంద్ కు పిలుపునిస్తే, ఆ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అనైతికం అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.