rain: ‘గులాబ్’ తుపాను ప్రభావం.. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు
- సంగారెడ్డి, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లో భారీ వర్షం
- రోడ్లు జలమయం
- జేఎన్టీయూ పరీక్షలు వాయిదా
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుపాను ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లోను, సంగారెడ్డి, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది.
హైదరాబాద్‌లో అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబరు 040-23202813కు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పారు. మరోవైపు, జహీరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 63,102 క్యూసెక్కులుగా ఉంది. వర్షాల కారణంగా జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని, రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు.