Telangana: బార్లు, రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు.. త్వరలో నిర్ణయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- దీనిపై పరిశీలన జరుగుతోందన్న మంత్రి
- నిష్పక్షపాతంగా కేటాయింపులుంటాయని వెల్లడి
మద్యం షాపుల్లో ఇప్పటికే రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక బార్లు, రెస్టారెంట్లలోనూ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
గౌడ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే మద్యం షాపుల్లో వారికి ప్రభుత్వం 15 శాతం, 10 శాతం, 5 శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పించిందని చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లను ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, దీనిపై పరిశీలన చేస్తామన్నారని తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
జిల్లాలవారీగా రిజర్వేషన్లను కల్పిస్తామని, నిష్పక్షపాతంగా కేటాయింపులు జరుపుతామని తెలిపారు. దేశంలో విప్లవాత్మక మార్పులను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. విద్యతో పాటు బీసీల ఎదుగుదలకు ఎన్నో చేస్తున్నారని కొనియాడారు. ఇతర పార్టీలు గౌడ్ లను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు.