Cricket: ఏడ్చేసినంత పనిచేసిన ముంబై యువ ఆటగాడు.. దగ్గరకొచ్చి ఓదార్చిన కోహ్లీ.. వీడియో ఇదిగో

Mumbai Indians Young Batsman Almost Cries Kohli Consoles

  • ఫాం లేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్
  • వరుస మ్యాచ్ లలో విఫలం
  • ఆర్సీబీతో మ్యాచ్ లోనూ ఫెయిల్
  • అతడిపై ఒత్తిడి పెట్టబోనన్న రోహిత్

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఓటమి కొనసాగుతోంది. మిడిలార్డర్ విఫలమవుతుండడంతో చిన్న టార్గెట్లనూ ఛేదించలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లోనూ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, గత సీజన్ లో చెలరేగిన యువ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో మాత్రం విఫలమవుతున్నాడు. ఫాంను అందుకోలేక సతమతమవుతున్నాడు.

ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్ లోనూ అతడు స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం అతడు ఏడ్చేసినంత పనిచేశాడు. దీంతో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిని ఓదార్చాడు. అతడిని ప్రోత్సహించే మాటలు చెప్పాడు. వైఫల్యాల నుంచి నేర్చుకునే తత్వం గురించి ఉద్బోధించాడు.

ఇటు రోహిత్ శర్మ కూడా అతడి ఫాం లేమిపై స్పందించాడు. ఇషాన్ కిషన్ ఫాం గురించి కంగారు పడాల్సిన పనిలేదని చెప్పాడు. అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేయాలనుకుంటున్న అతడిపై ఒత్తిడి పెట్టుదలచుకోలేదని చెప్పాడు. ‘‘అతడు ప్రతిభ కలిగిన ఆటగాడు. గత ఏడాది ఐపీఎల్ లో ఇషాన్ బాగా ఆడాడు. మళ్లీ అలాంటి ఆట ఆడేందుకే సూర్యకుమార్ కు బదులు.. ఇషాన్ ను ముందు పంపించాం. ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. అతడిపై ఒత్తిడి పెంచకూడదు’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, గత సీజన్ లో 57 సగటుతో ఇషాన్ 516 పరుగులు చేశాడు. ఇప్పుడు కేవలం 103 పరుగులే చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో రాణించిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ను అక్టోబర్ 17 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News