Adimulapu Suresh: ఎయిడెడ్ విద్యాసంస్థల పరిస్థితిపై మరింత స్పష్టత నిచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి
- ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వ సంస్కరణలు
- కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం
- తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవన్న ఆదిమూలపు
- ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టీకరణ
ఏపీలో ఎయిడెడ్ సంస్థల ఆస్తులు కాజేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకే వివాదాస్పద జీవో తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ గ్రాంటుతో నడుస్తున్న విద్యాసంస్థలు 2 వేలకు పైగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ ఎయిడెడ్ విద్యాసంస్థల ద్వారా మెరుగైన ఫలితాలు రావడంలేదని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో నిరర్ధకంగా పనిచేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను ప్రభుత్వమే తీసుకోవాలన్నది ఈ కమిటీ సిఫారసుల్లో ఒకటని, కమిటీ చేసిన సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి ఆదిమూలపు వివరించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల ముందు మూడు ప్రతిపాదనలు ఉంచామని అన్నారు. 1.ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ గ్రాంటును పూర్తిగా వదులుకోవడం. 2. విద్యాసంస్థను మొత్తంగా ప్రభుత్వానికి అప్పగించడం 3. పూర్తిగా ప్రైవేటుగా విద్యాసంస్థను నడిపించడం... వంటి ప్రతిపాదనల్లో ఏదో ఒకదానిని ఎయిడెడ్ విద్యాసంస్థలు ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అన్ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడవని, వాటి యాజమాన్యాలు మూసివేయాలని నిర్ణయించుకుంటే వాటిని ప్రభుత్వమే నడుపుతుందని వెల్లడించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాసంస్థలు మూతపడవని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆదిమూలపు తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఈ సంస్కరణలు తీసుకువచ్చింది విద్యాసంస్థల ఆస్తులను కొట్టేసేందుకు కాదని స్పష్టం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలేజీల్లో లెక్చరర్లకు సాధారణ రీతిలోనే బదిలీలు ఉంటాయని వివరించారు.