Bharat Bandh: నేటి భారత్ బంద్ సక్సెస్... రాకేశ్ తికాయత్ ప్రకటన

Rakesh Tikait says Bharat Bandh success

  • జాతీయ సాగు చట్టాలకు నిరసనగా బంద్
  • కొంతకాలంగా పోరు సాగిస్తున్న రైతు సంఘాలు
  • సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్
  • విమర్శకులకు ఇది చెంపపెట్టు అన్న తికాయత్

కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో రైతు సంఘాలు, విపక్షాలు పిలుపునిచ్చిన మేరకు నేడు భారత్ బంద్ జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం అయిందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన మేరకు 10 గంటల భారత్ బంద్ సక్సెస్ అయింది... సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం అన్న వారికి ఇది చెంపపెట్టు వంటి పరిణామం అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి రావడం ద్వారా కేంద్ర సాగు చట్టాలపై తమ వ్యతిరేకతను వెలిబుచ్చారని తికాయత్ వెల్లడించారు. విమర్శకులు కళ్లు తెరిచి చూడాలని, యావత్ దేశం రైతులకు ఏవిధంగా మద్దతుగా నిలిచిందో గమనించాలని హితవు పలికారు. బంద్ కు రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి విశేష మద్దతు లభించిందని వివరించారు.

భారత్ బంద్ ను శాంతియుతంగా చేపట్టినందుకు దేశవ్యాప్త నిరసనకారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు దేశంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు, కనీస మద్దతు ధరపై హామీ ఇచ్చేంతవరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని తికాయత్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News