USA: అమెరికా మాజీ అధ్యక్షుడు రీగన్ పై నాటి హత్యాయత్నం కేసు నుంచి నిందితుడికి పూర్తి విముక్తి
- వచ్చే ఏడాది జూన్ లో ఆంక్షలు ఎత్తివేత
- ఆదేశాలిచ్చిన ఫెడరల్ కోర్టు జడ్జి
- 1981 మార్చి 30న రీగన్ పై హత్యాయత్నం
- ఘటనలో ముగ్గురికి గాయాలు
- 2016లో నిందితుడు జాన్ హింక్లీకి బెయిల్
ఇది 40 ఏళ్ల కిందటి మాట.. అమెరికా నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగింది. 1981 మార్చి 30న వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్ బయట జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్ పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో రీగన్ ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, పోలీస్ అధికారి, ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంటు గాయపడ్డారు. ఆ హత్యాయత్నానికి సంబంధించిన కేసులో నిందితుడు జాన్ హింక్లీ జూనియర్ (66 ఏళ్లు)కు ఇప్పుడు కోర్టు పూర్తి విముక్తిని కల్పిస్తూ, బెయిల్ షరతులను ఎత్తేసింది. ఈ ఆదేశాలు వచ్చే జూన్ నుంచి అమలులోకి వస్తాయి.
నాడు ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ కోర్టులో కేసు నడుస్తోంది. అయితే, 'ట్యాక్సీ డ్రైవర్' హీరోయిన్ జోడీ ఫోస్టర్ ను ఇంప్రెస్ చేసేందుకే రీగన్ ను హత్య చేసేందుకు ప్రయత్నించానని అతడు చెప్పే సరికి అందరూ షాక్ అయ్యారు. విచారణ అనంతరం జాన్ కు జడ్జి శిక్ష విధించారు. అయితే 2016లో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. వాషింగ్టన్ సైకియాట్రిక్ ఆసుపత్రిలో చికిత్సనందించే క్రమంలో అతడిని జైలు నుంచి విడుదల చేశారు.
అయితే, అప్పుడు దేశం విడిచిపెట్టి పోవద్దని, తన తల్లిగారి ఊరైన వర్జీనియాలోని విలియమ్స్ బర్గ్ నుంచి 80 కిలోమీటర్లు దాటి వెళ్లొద్దని కోర్టు ఆంక్షలు పెట్టింది. నాటి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యులుండే ఏ చోటుకూ వెళ్లకూడదని ఆదేశించింది. తాజాగా ఆ ఆదేశాలను ఫెడరల్ జడ్జి కొట్టేశారు. జస్టిస్ డిపార్ట్ మెంట్, హింక్లీ తరఫు లాయర్ కు కుదిరిన ఒప్పందం మేరకు హింక్లీకి స్వేచ్ఛను ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ నుంచి అతడు స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పారు.
ఈ నిర్ణయంపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ అండ్ ఇనిస్టిట్యూట్ మండిపడింది. అతడు ఎప్పటికైనా ఎదుటివారికి ముప్పేనని, అతడి విడుదలను వ్యతిరేకిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. కోర్టు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా జస్టిస్ డిపార్ట్ మెంట్ మోషన్ పిటిషన్ వేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పింది.