Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో కలకలం.. రాజీనామా చేసిన సిద్ధూ
- పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
- తన రాజీనామా లేఖను సోనియాకు పంపిన సిద్ధూ
- పంజాబ్ భవిష్యత్తు విషయంలో రాజీపడలేనని వ్యాఖ్య
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు.
ఒక మనిషి వ్యక్తిత్వ పతనం అతను రాజీపడటం ద్వారా ప్రారంభమవుతుందని తన రాజీనామా లేఖలో సిద్ధూ తెలిపారు. అందుకే, పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం విషయంలో తాను ఏ మాత్రం రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి మాత్రం సేవ చేస్తానని తెలిపారు. సిద్ధూ తీసుకున్న సంచలన నిర్ణయంతో పంజాబ్ కాంగ్రెస్ పెద్ద కుదుపుకు గురయింది.
రాణా గుర్జీత్ సింగ్ ను తాను వద్దని చెపుతున్నా మంత్రివర్గంలోకి తీసుకోవడమే సిద్ధూ రాజీనామా నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. రాణా గుర్జీత్ సింగ్ ఇసుక మైనింగ్ వేలం వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సిద్దూపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. దేశానికి, పంజాబ్ కు సిద్దూ ప్రమాదకరమని ఆయన అన్నారు. మరోవైపు అమరీందర్ సింగ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.