Posani Krishna Murali: సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కల్యాణ్ తో జరిగిన గొడవను వివరించిన పోసాని
- మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని
- తనకు వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని వెల్లడి
- జగన్ కు అభిమానిని అని వెల్లడి
- జగన్ ను ఎవరేమన్నా అంటే భరించలేనని స్పష్టీకరణ
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, నటుడు పోసాని కృష్ణమురళి అదేరీతిలో ధ్వజమెత్తారు. అయితే, తనకు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయంటూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఓ కాల్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చూపించారు. పవన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు.
కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదని పోసాని అన్నారు. తాను జగన్ అభిమానినని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గతంలో పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన ఓ గొడవను పోసాని మీడియాకు వివరించారు. తాను సాధారణంగా సాయంత్రం 6 గంటలకే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని, కానీ ఓసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో రాత్రి షెడ్యూల్ పెట్టారని వెల్లడించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా గానీ పవన్ రాలేదని, దాంతో తాను ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు.
రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. "ఇది సినిమా అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఎవరికి చెప్పి ఇంటికి వెళ్లారు? మేమందరం పిచ్చోళ్లమా? అంటూ పవన్ కేకలు వేశారు. దాంతో నాక్కూడా కోపం వచ్చింది. నేను కూడా ఆర్టిస్ట్ నే... మీకోసం 9 గంటల వరకు చూశాను... రాలేదు. మీరు 10 గంటలకి వస్తే అప్పటిదాకా మేం ఎదురుచూస్తుండాలా? అంటూ నేను కూడా అదే స్థాయిలో బదులిచ్చా. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తీసేశారు" అంటూ వివరించారు.