Aam Aadmi Party: పంజాబ్ పర్యటనలో కేజ్రీవాల్ భారీ ప్రకటన: ఆప్
- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో వేడెక్కిన పంజాబ్ రాజకీయం
- సిద్ధూ, కెప్టెన్ గొడవతో కాంగ్రెస్‌లో చీలిక
- క్యాష్ చేసుకునే యోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ
పంజాబ్ పర్యటన సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ భారీ ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ ప్రాభవం తక్కువగా ఉండటంతో పోటీ అంతా ఆప్, కాంగ్రెస్ మధ్యే అని అంతా అనుకున్నారు. అయితే బీజేపీ కూడా మంచి పోటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రగడ ఆ పార్టీ కొంప ముంచేలా ఉంది. ఇప్పటికే సిద్ధూను ఎన్నికల్లో గెలవనివ్వబోనని, అతన్ని పంజాబ్ సీఎం కానివ్వనని అమరీందర్ శపథం చేశారు. ఇప్పుడు తాజాగా సిద్ధూ కూడా తన పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని ఆప్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కేజ్రీవాల్ చేపట్టే రెండ్రోజుల పర్యటన కీలకం కానుంది. ఈ పర్యటనలో కేజ్రీవాల్ కొన్ని భారీ ప్రకటనలు చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం నాడు లూధియానాలో కేజ్రీ పర్యటిస్తారు. అక్కడి వ్యాపారులతో సమావేశమవుతారని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి.