Navjot Singh Sidhu: అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. రాజీపడబోను: సిద్ధూ
- పంజాబ్ భవిష్యత్తే నాకు ముఖ్యం
- ప్రజలకు మంచి చేయాలన్నదే నా ఉద్దేశం
- ఎవరితోనూ వ్యక్తిగతంగా వైరం లేదు
- ప్రజల జీవితాలను మార్చేందుకే కృషి
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ భవిష్యత్తుపై తాను ఎప్పటికీ రాజీ పడలేనని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పీసీసీ పదవికి రాజీనామాపై ఆయన ఈ రోజు స్పందిస్తూ ప్రజలకు మంచి చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా వైరం లేదని చెప్పారు.
తాను ప్రజల జీవితాలను మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తన సిద్ధాంతాలపై రాజీపడబోనని సిద్ధూ ప్రకటించారు. కాగా, పంజాబ్ రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. త్వరలోనే సిద్ధూ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లేక ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.మరోపక్క, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు త్వరలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.