Pakistan: తదుపరి ప్రవక్త తానేనన్న స్కూల్ ప్రిన్సిపాల్.. దైవదూషణ అంటూ మరణశిక్ష విధించిన పాక్ కోర్టు

Pak Court Sentenced Death To Principal Under Blasphemy Act

  • 2013లో ప్రవక్తపై కామెంట్లు చేసిన సల్మా తన్వీర్
  • వ్యక్తి ఫిర్యాదుతో సెషన్స్ కోర్టులో విచారణ
  • తాజాగా తీర్పును వెలువరించిన జడ్జి
  • పాక్ లో దైవదూషణ చట్టం కింద ఇప్పటిదాకా 1,472 మందిపై కేసు
  • న్యాయ సాయమూ అందించని వైనం

మహ్మద్ ప్రవక్త తర్వాత తానే తదుపరి ప్రవక్త అని అనడమే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన నేరం. ఆ వ్యాఖ్యలు ‘దైవదూషణ’గా పేర్కొంటూ పాకిస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్ లోని లాహోర్ నిష్తార్ కాలనీకి చెందిన సల్మా తన్వీర్ ఓ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

2013లో ఆమె తనకు తాను ప్రవక్తగా ప్రకటించుకున్నారు. దీంతో అదే ఏడాది స్థానిక మత పెద్ద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మద్ ప్రవక్తను ఆమె దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసును విచారిస్తున్న జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి మన్సూర్ అహ్మద్ సోమవారం తీర్పును వెలువరించారు. ఇస్లాంలో చివరి ప్రవక్త మహ్మద్ ప్రవక్త కాదని ఆమె దైవదూషణకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఆమెకు మరణశిక్ష విధిస్తున్నామని, దాంతో పాటు 5 వేల పాక్ రూపీల జరిమానాను వేస్తున్నామని తీర్పునిచ్చారు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మాత్రం ఆమె ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఆమెకు కోర్టు శిక్షను ఖరారు చేసింది.

కాగా, పాకిస్థాన్ తెచ్చిన వివాదాస్పద దైవదూషణ చట్టం కింద 1987 నుంచి ఇప్పటిదాకా 1,472 మందికి శిక్షలు విధించారు. ఇక, దైవదూషణ చేసిన వారికి న్యాయసాయం కూడా అందించరు. వారు కోరుకున్న లాయర్లను పెట్టుకోనివ్వరు. చాలా మంది లాయర్లూ ఆ కేసులను వాదించరు.

  • Loading...

More Telugu News