Afghanistan: విమాన సర్వీసులు పునరుద్ధరించండి.. భారత్ కు తాలిబన్ ప్రభుత్వ విన్నపం
- ఖతార్ సాంకేతిక సహాయాన్ని అందించింది
- కాబూల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించామని వెల్లడి
- తొలిసారి అధికారికంగా సంప్రదింపులు జరిపిన తాలిబన్ ప్రభుత్వం
భారత ప్రభుత్వంతో ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను కోరింది. ఈ మేరకు మన డీజీసీఏకు ఆఫ్ఘనిస్థాన్ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్ తో అధికారికంగా సంప్రదింపులు జరపడం ఇదే ప్రథమం. ఆప్ఘనిస్థాన్ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి హమీదుల్లా పేరిట ఈ లేఖ అందింది.
'అమెరికా దళాలు ఆప్ఘనిస్థాన్ నుంచి వెళ్లే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఖతార్ అందించిన సాంకేతిక సహాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాం. భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య విమానాల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం' అని లేఖలో తాలిబన్ ప్రభుత్వం విన్నవించింది.