Naresh: 'మా' నుంచి మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారో చెప్పండి: ప్రకాశ్ రాజ్ కు నరేశ్ ప్రశ్న

Naresh fires on Prakash Raj

  • 'మా' సభ్యులను ప్రకాశ్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నారు
  • అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలుగు వ్యక్తే ఉండాలి
  • మంచు విష్ణు ప్యానల్ గెలుపు కోసం కృషి చేస్తా

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణుకు ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ మద్దతు ప్రకటించారు. పార్క్ హయత్ హోటల్లో మంచు విష్ణుతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో నరేశ్ మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'మా' సభ్యులను ప్రకాశ్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. క్షుద్ర రాజకీయాలు చేయవద్దని అన్నారు. ప్రకాశ్ రాజ్ ఒక్కసారైనా 'మా' ఎన్నికల్లో ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఒక్క మీటింగ్ కు అయినా హాజరయ్యారా? అని అడిగారు. 'మా' నుంచి మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారో చెప్పాలని అన్నారు. 'మా' కార్యవర్గంలో సరైన వ్యక్తి లేకపోవడం వల్లే తాను వచ్చానని ప్రకాశ్ రాజ్ చెప్పడం ఆశ్చర్యకరమని చెప్పారు.

అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలుగు వ్యక్తే ఉండాలని... ప్రకాశ్ రాజ్ సభ్యుడిగా ఉంటే తమకు అభ్యంతరం లేదని నరేశ్ అన్నారు. ఎప్పుడూ 'మా' సమావేశాలకు హాజరుకాని మీకు ఉన్నట్టుండి అసోసియేషన్ పై ప్రేమ ఎలా కలిగిందని ప్రశ్నించారు. అసోసియేషన్ లో ఉన్నవారికి పదవీ వ్యామోహం ఉండరాదని చెప్పారు.

'మంచి మైక్ లో చెప్పండి.. చెడు చెవిలో చెప్పండి' అంటూ సినీ పెద్దలు చెప్పిన మాటలకు కట్టుబడి తాను నోటికి తాళం వేసుకున్నానని అన్నారు. కరోనా సమయంలో తమ శాయశక్తులా సభ్యులకు సేవ చేశామని చెప్పారు. 'మా' భవనాన్ని నిర్మిస్తానని విష్ణు చెప్పాడని... విష్ణుకు బాలకృష్ణ ఫోన్ చేసి తాను కూడా ఉన్నానని చెప్పారని... ఇది చాలా సంతోషకరమని అన్నారు. విష్ణు ప్యానల్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News