Parthasarathi: మీ బుద్ధి తెలిసే నిర్మాతలంతా వచ్చి పేర్ని నానిని కలిశారు: పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్
- స్టార్ డమ్ ను అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు
- వర్గాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు
- పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఒక్క ఎంపీపీని గెలవలేకపోయారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని అన్నారు. సినిమా రంగం వల్ల పవన్ బాగుపడ్డారు కానీ... ఆయన వల్ల సినీరంగం బాగుపడలేదని చెప్పారు. హీరోగా ఉన్న స్టార్ డమ్ ను అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని అన్నారు.
ప్రైవేట్ వెబ్ సైట్లు సినిమా ప్రేక్షకులను దోచుకుంటున్నాయని... రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 టికెట్ పై కేవలం రూ. 2 మాత్రమే వసూలు చేస్తుందని చెప్పారు. వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని పవన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు రాష్ట్ర సమస్యలపై పవన్ కు అవగాహన లేదని పార్థసారథి అన్నారు.
సంక్షేమ పథకాల వల్ల 6.81 కోట్ల మందికి రూ. లక్ష కోట్లకు పైగానే లబ్ధి చేకూరుతోందనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలని చెప్పారు. టీడీపీ పాలనలో రోడ్లను మరమ్మతు చేయలేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాల కారణంగా రోడ్లు పాడయ్యాయని... రోడ్ల మరమ్మతులకు రూ. 2 వేల కోట్లతో టెండర్లను పిలిచిన సంగతి పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాటల్లో నిలకడ ఉండదని... ఏ నిమిషంలో ఏమైనా మాట్లాడగలరని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ పార్టీని పెట్టి ఇన్నేళ్లయినా, ఇంత వరకు ఒక ఎంపీపీని కూడా గెలవలేకపోయారని పార్థసారథి ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయారని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఫిలిం ఛాంబర్ కూడా ఖండించిందని... ఆయన బుద్ధి తెలిసే నిర్మాతలు వచ్చి మంత్రి పేర్ని నానిని కలిశారని చెప్పారు.
వైయస్ వివేకా హత్య, కోడికత్తి దాడి టీడీపీ హయాంలో జరిగాయని... అప్పుడు వాటి గురించి ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వర్గ శత్రువులు అంటూ పవన్ కల్యాణ్ కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చారని... కమ్మవారు వైసీపీకి వర్గ శత్రువులు కాదని చెప్పారు. తమ ప్రభుత్వంలో కమ్మ మంత్రులు కూడా ఉన్నారని అన్నారు.