Andhra Pradesh: తెలంగాణ అబద్ధాలు చెబుతోంది.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు: గోదావరి బోర్డు, కేంద్రానికి ఏపీ లేఖ
- తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లో అవాస్తవాలు
- కొత్త ట్రైబ్యునల్ అవార్డు ఇచ్చే వరకు వాటిని పక్కనపెట్టండి
- పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని, వాటిని ఆమోదించవద్దంటూ గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి నీటిపై కేటాయింపులకు సంబంధించి తెలంగాణ చెబుతున్నది వాస్తవం కాదని పేర్కొన్న ఏపీ.. నీటి లభ్యతపై అంచనా వేసి, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఒప్పందం చేసుకోవాలని, లేదంటే కొత్త ట్రైబ్యునల్ అవార్డు ఇచ్చే వరకు తెలంగాణ డీపీఆర్‌లను పక్కనపెట్టాలని ఆ లేఖలో కోరింది.
సీతారామ, తుపాకులగూడెం సహా అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌ల ఆమోదం కోసం గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తోందని ఆరోపించింది.
ఈ ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు నిన్న గోదావరి బోర్డు చైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు.