Janasena: కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానానికి అనుమతి నిరాకరణ.. కాసేపట్లో పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ
- కాటన్ బ్యారేజీపై అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం
- అక్కడి రోడ్లపై గుంతలు పూడ్చడం ఏంటన్న జలవనరుల శాఖ
- సాంకేతిక పరిజ్ఞానం లేకుండా పూడ్చితే బ్యారేజీకి నష్టమని వ్యాఖ్య
- రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రమదానం
కాటన్ బ్యారేజీపై అక్టోబరు2న జనసేన పార్టీ శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందుకు ఏపీ జల వనరుల శాఖ అనుమతి నిరాకరించింది. పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమం చేపట్టాలనుకున్న కాటన్ బ్యారేజీ ఆర్అండ్బీ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
కేవలం ప్రజల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని ప్రకటన చేసింది. కాటన్ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరుగుతుందని జల వనరుల శాఖ తెలిపింది. అయితే, కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ నేతలు, కార్యకర్తలతో మరోసారి భేటీ కానున్నారు. అక్టోబరు 2న చేపట్టాల్సిన రోడ్ల శ్రమదానం కార్యక్రమంపై ఆయన చర్చించనున్నారు. అన్ని నియోజక వర్గాల్లోనూ శ్రమదానంలో జనసైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడబోరని ప్రత్యేకంగా చెప్పింది.