Gautam Adani: గౌతమ్ అదానీ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
- అదానీ సంపాదన రోజుకు రూ.1,002 కోట్లు
- రూ.5.05 లక్షల కోట్లకు పెరిగిన సంపద
- ఆసియాలోని భారత కుబేరుల జాబితాలో రెండోస్థానం
- అగ్రస్థానంలో కొనసాగుతున్న ముఖేశ్ అంబానీ
అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ (59) ఆసియాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. ఆయన సంపద రూ.1,40,200 కోట్ల నుంచి ఏకంగా రూ.5,05,900 కోట్లకు పెరగడం విశేషం. ప్రస్తుత గణాంకాల ప్రకారం అదానీ రోజుకు రూ.1,002 కోట్లు సంపాదిస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు ఐఐఎఫ్ఎల్ వెల్త్-హరూన్ ఇండియా రిచ్ లిస్టు-2021లో పేర్కొన్నారు.
ఈ జాబితాలో రిలయన్స్ కుబేరుడు ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ రూ.7,18,000 కోట్లు అని హరూన్ ఇండియా నివేదికలో వివరించారు. ముఖేశ్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా పదోసారి.
ఇక ఈ జాబితాలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ రూ.1,31,600 కోట్ల సంపదతో 8వ స్థానం దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో హెచ్ సీఎల్ అధినేత శివ్ నాడార్ ఫ్యామిలీ రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఎస్పీ హిందూజా (రూ.2,20,000 కోట్లు), ఐదో స్థానంలో ఎల్ఎన్ మిట్టల్ (రూ.1,74,400 కోట్లు), ఆరోస్థానంలో సైరస్ పూనావాలా (రూ.1,63,700 కోట్లు), ఏడో స్థానంలో రాధాకృష్ణన్ దమాని (రూ.1,54,300 కోట్లు) ఉన్నారు. తొమ్మిదో స్థానంలో కుమార మంగళం బిర్లా (రూ.1,22,200 కోట్లు), పదో స్థానంలో జై చౌదరి (రూ.1,21,600 కోట్లు) ఉన్నారు.