Rajasthan: అక్టోబరు 1 నుంచి టపాసులపై రాజస్థాన్ బ్యాన్
- మూడు నెలల పాటు కొనసాగనున్న నిషేధం
- వచ్చే ఏడాది జనవరి 31 వరకూ టపాసులపై బ్యాన్
- కరోనా మూడో వేవ్ భయంతోనే అన్న సర్కారు
పండుగల సీజన్‌లో కరోనా మూడో వేవ్ వస్తుందనే భయంతో రాజస్థాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు రాజస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. బాణసంచా కాల్చడం, అమ్మడంపై ఈ నిషేధం అమలవుతుందని తెలిపింది.
గాలి కాలుష్యం వల్ల కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వివరించింది. ఈ కారణంగానే బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు తెలియజేసింది. కాగా, కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకూ బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే వచ్చే నెలలో దీపావళి, దసరా వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధించడం పట్ల కొందరు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.