TTD: శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న టీటీడీ జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్

6 people including ttd employee arrested for selling tickets in black

  • ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఒక్కోదానిని రూ. 5 వేలకు విక్రయించిన వైనం
  • తాము ఎవరికీ సిఫారసు లేఖ ఇవ్వలేదన్న చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే పీఏ
  • విచారణలో కదిలిన డొంక
  • ఆటో డ్రైవర్ల నుంచి బ్యాంకు ఉద్యోగి వరకు లింకులు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను బ్లాక్‌లో అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో టీటీడీ జూనియర్ అసెస్టెంట్ కూడా ఉండడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 23న శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు భక్తులు తిరుమల వచ్చారు.

వీరు సర్వదర్శం టికెట్ల కోసం ప్రయత్నించగా లభ్యం కాలేదు. వీరి ప్రయత్నాలను గమనించిన సుదర్శన్‌రెడ్డి అనే కారు డ్రైవర్ వీరికి  ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఒక్కోదానిని రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 35 వేలకు ఇప్పించాడు. భక్తులు అతడిపై ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫారసు లేఖతో ఈ టికెట్లను సంపాదించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో ఆ ఎమ్మెల్యే పీఏను విచారిస్తే, తాము ఎవరికీ ఎలాంటి సిఫారసు లేఖ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో తిరిగి సుదర్శన్‌ను విచారించగా ఆటో డ్రైవర్ సాయికుమార్, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు మోహన్‌కుమార్, ప్రసాద్, కిరణ్ అనే వ్యక్తుల నుంచి టికెట్లు పొందినట్టు తెలిపాడు.

వారిని విచారిస్తే ఓ బ్యాంకులో పనిచేస్తున్న జయచంద్ర అనే వ్యక్తి ద్వారా టికెట్లు వచ్చినట్టు చెప్పారు. అతడిని విచారించగా, శ్రీవారి ఆర్జిత కార్యాలయంలో పనిచేసే టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కె.కిరణ్‌కుమార్ ద్వారా టికెట్లు సంపాదించినట్టు తెలిపారు. దీంతో పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News