MAA: మీ సినిమా బడ్జెట్ పవన్ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్ల కన్నా తక్కువ: ప్రకాశ్ రాజ్ ఫైర్
- పవన్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిక
- చిరంజీవి, కృష్ణ వంటి పెద్దవారిని ఎన్నికల్లోకి లాగడమేంటని ప్రశ్న
- పోసాని ఒక డేట్ అయిపోయిన ట్యాబ్లెట్: బండ్ల గణేశ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లోకి చిరంజీవి, కృష్ణ వంటి వారిని ఎందుకు లాగుతున్నారంటూ ఎదుటి ప్యానెల్ సభ్యులపై మండిపడ్డారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు ప్యానెల్‌కు చెందిన సీనియర్ నటుడు నరేశ్ విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ కూడా నరేశ్‌కు దీటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో రెండు ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అంశాన్ని కూడా ‘మా’ ఎన్నికల్లో ప్రస్తావించడం పట్ల ప్రకాశ్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ విషయంలో విష్ణు ప్యానెల్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సీరియస్‌గా హెచ్చరించారు. పవన్ మొదట నటుడని, ఆ తర్వాతే పొలిటీషియన్ అని తెలిపారు.
‘‘మీ సినిమాల బడ్జెట్ మొత్తం కలిపినా పవన్ సినిమా మార్నింగ్ షోకి వచ్చే కలెక్షన్లంత ఉండదు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనూహ్యంగా ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్ కూడా ఈ అంశంపై స్పందించారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కూడా మంచి చేయడం కోసమే పోటీ పడుతున్నారని, అందుకే తాను తప్పుకున్నానని వివరించారు. అలాగే పోసాని, పవన్ మధ్య గొడవపై కూడా మాట్లాడారు. పోసాని ఒక డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ వంటి వాడంటూ విమర్శించారు.