India: భారత్‌లో జియోకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న మస్క్, బెజోస్
- స్టార్‌లింక్‌ను వచ్చే ఏడాది తెచ్చే యోచనలో ఎలన్ మస్క్
- ఇంటర్నెట్ సర్వీస్‌లోకి అడుగుపెట్టేందుకు బెజోస్ ఆసక్తి
- అదే జరిగితే జియోకు భారత్‌లో పోటీ తప్పదంటున్న విశ్లేషకులు
ప్రస్తుతం భారతదేశంలో అత్యథికులు ఉపయోగించే ఇంటర్నెట్ సర్వీస్ జియో. దీనికి దీటుగా నిలిచేందుకు మిగతా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలివ్వడం లేదు. అయితే భవిష్యత్తులో ఈ సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ కుబేరులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తన ‘స్టార్ లింక్’ ప్రాజెక్టుతో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలోకి అడుగు పెడుతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
అమెజాన్ సంస్థ కూడా ‘ప్రాజెక్ట్ కూయిపర్’తో ఈ రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. ఉపగ్రహాల ద్వారా అందించే ఈ సేవలు మరింత వేగంగా ఉండటంతోపాటు, మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా అందించవచ్చు.
ఈ విషయంలో బెజోస్ కన్నా మస్క్ ఒకడుగు ముందున్నాడు. ఇప్పటికే పేపాల్ వ్యవస్థాపక ఉద్యోగి అయిన సంజయ్ భార్గవను స్టార్‌లింక్ డైరెక్టర్‌గా నియమించారు. భారత్‌లో బాండ్‌విత్ రంగంలోని నియమ నిబంధనలపై అధ్యయనం కూడా ప్రారంభించేశారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 డిసెంబరు నుంచి స్టార్‌లింక్ సేవలు అందించాలని మస్క్ ప్లాన్. ఆ తర్వాత బెజోస్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుంటే జియోకు భారీగా పోటీ పెరగడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.