Haryana: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై వాటర్ కేనన్ల ప్రయోగం
- హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం
- బారికేడ్లు దూకి లోపలికి ప్రవేశించే యత్నం
- వాటర్ కేనన్లు ప్రయోగించి చెదరగొట్టిన పోలీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పాల్గొంటున్న ఓ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. మంత్రి హాజరయ్యే కార్యక్రమం కోసం స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులు బారికేడ్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. వారిని చెదరగొట్టేందుకు వాటర్ కేనన్లు ప్రయోగించారు.
మరో ఘటనలో అంబాలాలో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్‌కడ్, ఎమ్మెల్యే ఆర్ఎల్ కటారియా వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు.