Prime Minister: ప్రతిపక్షాలకు తనదైన శైలిలో ప్రధాని మోదీ కౌంటర్​

Narendra Modi Slams Opposition Over Lack Of Subject Knowledge

  • దేశంలో విమర్శకులు లేరంటూ వ్యాఖ్య
  • విమర్శ చేయాలంటే లోతైన పరిశోధన చేయాలని కామెంట్
  • బహుశా పరిశోధనకు టైం లేదేమోనని వ్యంగ్యం

ఆత్మ నిర్భర్ భారత్ వల్లే ఇవాళ దేశంలో ఇంత మందికి కరోనా టీకాలు వేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దానికి సాంకేతికత వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. తాను విమర్శలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్లకు దూరంగా ఉన్నాయన్నారు.

అయితే, భారత్ ఆత్మ నిర్భర్ అయినందువల్లే మనకు వ్యాక్సిన్లతో సమస్య రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే దేశంలో 69 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్లు వేశామని ఆయన తెలిపారు. 25 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందిందని చెప్పారు. ఓపెన్ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

కొందరు కేవలం ఆరోపణలే చేస్తారని, విషయ పరిజ్ఞానం తెలియకుండానే మాట్లాడుతారని విమర్శించారు. విమర్శించాలంటే లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంటుందన్నారు. విమర్శలను తాను తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఇప్పుడు విమర్శకులు చాలా తక్కువగా ఉన్నారన్నారు. బహుశా సమయం లేకపోవడం, వేగంగా ప్రపంచం ముందుకు పోతుండడం వల్లే వారు విషయాలపై లోతైన పరిశోధన చేయడం లేనట్టుందన్నారు.

వ్యాక్సిన్ విజయవంతమవడం వెనుక ఎంతో శ్రమ ఉందన్నారు. ప్రణాళిక, లాజిస్టిక్స్ వంటివి కీలక పాత్ర పోషించాయన్నారు. ప్రపంచానికి మన విజయాన్ని మీడియా సంస్థలు తెలియజెప్పాలని ఆయన కోరారు. ప్రపంచంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు 2020 మేలోనే తాము వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించామన్నారు. వ్యాక్సినేషన్ వేగంగా మొదలయ్యేలా, వేగంగా సాగేలా చూసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన దేశాల కన్నా వ్యాక్సినేషన్ లో మనమే ముందున్నామన్నారు.

  • Loading...

More Telugu News