Pawan Kalyan: మీ కోపాన్ని సీమ వాళ్లలా దాచుకోండి.. మిమ్మల్ని రాయలసీమకు ట్రైనింగ్ కు పంపుతా: పవన్ కల్యాణ్
- జనసైనికుల్లో ఎంత కోపం ఉందో నాకు తెలుసు
- లక్ష మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంది
- నేను యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది
2024 ఎన్నికల్లో జనసేన గెలుపు తథ్యమని జనసేనాని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసమే మనమంతా తపిస్తున్నామని చెప్పారు. ధవళేశ్వరంలో లక్ష మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని... 4 వేలకు పైగా వాహనాలను అడ్డుకున్నారని... జనసేనను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతోందన్న దానికి ఇదే నిదర్శనమని అన్నారు.
ప్రతి జనసైనికుడిలో ఎంత కోపం ఉందో తనకు తెలుసని... అయితే అందరూ ఆ కోపాన్ని దాచుకోవాలని చెప్పారు. కోపాన్ని తారాజువ్వలా వదిలేస్తే ఆ తర్వాత వెంటనే కిందకు పడుతుందని అన్నారు. కోపాన్ని దాచుకోవడం రాయలసీమ ప్రజలను చూసి నేర్చుకోవాలని చెప్పారు. సీమ ప్రజలు తమ కోపాన్ని రెండు, మూడు తరాలు కూడా దాచుకుంటారని అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు కూడా కోపాన్ని దాచుకునే విద్యను అభ్యసించాలని... అందుకోసం మిమ్మల్ని రాయలసీమకు ట్రైనింగ్ కు పంపుతానని చెప్పారు. అగ్నిపర్వతం గర్భంలో లావా మాదిరి కోపాన్ని దాచుకోవాలని అన్నారు.
రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంటుందని పవన్ చెప్పారు. కమ్మవారికి వ్యతిరేకం కాదని చెప్పడానికే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని అన్నారు. ఇప్పుడు టీడీపీ సత్తా సరిపోవడం లేదని... అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. తాను యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమయిందని... యుద్ధంలో నేను చచ్చిపోతే దేశం నలుమూలలా పిడికెడు మట్టి వేయాలని అన్నారు.