India: లడఖ్ సరిహద్దుల్లో ’వజ్ర‘ రెజిమెంట్
- మరోసారి కాలుదువ్వుతున్న చైనా బలగాలు
- దీటుగా బదులిచ్చేందుకు కే9 వజ్ర శతఘ్నులను మోహరించిన భారత్
- పూర్తి రెజిమెంట్ ఏర్పాటు చేశామన్న ఆర్మీ చీఫ్ నరవణే
మరోసారి భారత సరిహద్దుల్లో చైనా కాలుదువ్వుతోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా బలగాలను మోహరిస్తోందని భారత ఆర్మీ చీఫ్ నరవణే తెలిపారు. ఈ క్రమంలో భారత ఆర్మీ కూడా అధునాతన కే9 వజ్ర శతఘ్నులను రంగంలోకి దించింది. లడఖ్‌లోని ఫార్వర్డ్ ఏరియాలో తొలిసారి ఈ శతఘ్నులను మోహరించింది. ఇవి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ఈ హోవిట్జర్లతో కూడి పూర్తి రెజిమెంట్‌ను రంగంలోకి దించామని నరవణే తెలిపారు. ’’ఇవి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కూడా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ట్రయల్స్‌లో రుజువైంది. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడే ఏర్పాటు చేశాం. లడఖ్ వంటి ప్రాంతాల్లో ఈ హోవిట్జర్లు చాలా బాగా ఉపకరిస్తాయి‘‘ అని నరవణే తెలిపారు.
వీటిని తొలిసారిగా 2018లో భారత ఆర్మీలో ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ వీటిని గుజరాత్లో తయారు చేసింది. ఈ కే9 వజ్ర శతఘ్నులు ఒక్కోటీ 50 టన్నుల బరువు ఉంటాయి. 47 కేజీల బాంబులను విసరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.