Mohammad Shami: మ్యాక్స్ వెల్, డివిలియర్స్ దూకుడు... ఆఖర్లో మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టిన షమీ
- షార్జాలో బెంగళూరు వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు
- మ్యాక్స్ వెల్ అర్ధసెంచరీ
ఐపీఎల్ లో నేడు తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (40), కెప్టెన్ విరాట్ కోహ్లీ (25) తొలివికెట్ కు 68 పరుగులు జోడించి శుభారంభం అందించగా, మిడిలార్డర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్ వెల్ కేవలం 33 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. అతడికి ఏబీ డివిలియర్స్ (18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 23) కూడా తోడవడంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు తీసింది.
అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటవడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. చివరి ఓవర్లో మహ్మద్ షమీ విజృంభించి బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడం విశేషం. తొలుత మ్యాక్స్ వెల్ ను అవుట్ చేసిన షమీ... ఆపై షాబాజ్ అహ్మద్ (8), జార్జ్ గార్టన్ (0)లను కూడా పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు మోజెస్ హెన్రిక్స్ 3 వికెట్లు తీసి బెంగళూరు టాపార్డర్ ను కట్టడి చేశాడు.