Blast: కాబూల్ లో మసీదు వద్ద భారీ పేలుడు... 14 మంది మృతి
- ఆఫ్ఘనిస్థాన్ రాజధానిలో భారీ విస్ఫోటనం
- ఈద్గా మసీదు వద్ద ఘటన
- ఘటనను నిర్ధారించిన తాలిబన్లు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ మసీదు వద్ద భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈద్గా మసీదు ప్రధాన ద్వారం వెలుపల జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. పెద్దసంఖ్యలో గాయపడగా, వారిని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ధాడి ఘటనను తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గతవారం జబీహుల్లా ముజాహిద్ తల్లి మరణించగా, ఆమె మరణానంతర ప్రార్థనలు మసీదులో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
కాగా, అహ్మదుల్లా అనే దుకాణదారు ఈ పేలుడు ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచాడు. ఈ పేలుడు ఘటనకు కొద్దిముందుగా తాలిబన్లు ఈ మసీదు రోడ్డును మూసివేసి జబీహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అహ్మదుల్లా వివరించాడు. ఈద్గా మసీదు వద్ద భారీ శబ్దం వినిపించిందని, ఆపై తుపాకీ కాల్పుల మోత వినిపించిందని తెలిపాడు.