RCB: పంజాబ్ తో ఉత్కంఠపోరులో బెంగళూరు విక్టరీ... ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన కోహ్లీ సేన
- షార్జాలో బెంగళూరు వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 రన్స్
- 6 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్
ఐపీఎల్ లో నేడు ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ లో బెర్తులు ఖరారు చేసుకోగా, మూడో జట్టుగా కోహ్లీ సేన కూడా ప్లే ఆఫ్స్ లో ప్రవేశించింది.
నేటి మ్యాచ్ విషయానికొస్తే... మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పంజాబ్ జట్టులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (57), కేఎల్ రాహుల్ (39) తొలి వికెట్ కు 10.5 ఓవర్లలోనే 91 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు.
అయితే, మిడిలార్డర్ తడబడడంతో పంజాబ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది. నికోలాస్ పూరన్ (3), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. షారుఖ్ ఖాన్ (16) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఆఖరి ఓవర్లో రనౌట్ కావడంతో పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసింది. బెంగళూరు బౌలర్లలో చహల్ 3, జార్జ్ గార్టన్ 1, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.
ఇక, నేటి రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.