TMC: బాప్‌రే! బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 154 కోట్లు ఖర్చు చేసిన టీఎంసీ, డీఎంకేది రెండో స్థానం
- ఎన్నికల వ్యయాలను వెల్లడించిన ఈసీ
- రూ.114.14 కోట్లతో రెండో స్థానంలో డీఎంకే
- కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లో చేసిన ఖర్చు కంటే టీఎంసీ చేసిన ఖర్చు రెండింతలు
- ఇప్పటి వరకు ఎన్నికల వ్యయం వెల్లడించని బీజేపీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా రూ. 154.28 కోట్లు ఖర్చు చేసింది. ఆయా శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. దీని ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఉంది. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన డీఎంకే రూ. 114.14 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఇందులో పుదుచ్చేరి ఖర్చులు కూడా కలిపే ఉన్నాయి.
ఇక అన్నాడీఎంకే తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో కలిపి రూ. 57.33 కోట్లు ఖర్చు చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో కలిపి కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ. 84.93 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఐదు రాష్ట్రాల్లో సీపీఐ మొత్తంగా రూ. 13.19 కోట్లు ఖర్చు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల వ్యయానికి సంబంధించి బీజేపీ వివరాలను వెల్లడించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో చేసిన ఖర్చు కంటే టీఎంసీ ఒక్క పశ్చిమ బెంగాల్‌లో చేసిన ఖర్చు రెండింతలు కావడం గమనార్హం.