Tsirkon: మొట్టమొదటిసారిగా హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను పరీక్షించిన రష్యా

Russia test fires hyper sonic cruise missile for the first time
  • నవీన తరం ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న రష్యా
  • గత జులైలో జిర్కోన్ మిస్సైల్ ప్రయోగం
  • విజయవంతమైందన్న రష్యా రక్షణ శాఖ
  • నేడు వీడియో ఫుటేజి విడుదల
నూతన తరం ఆయుధాలను అభివృద్ధి చేయడంలో రష్యా కీలక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారిగా హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను పరీక్షించింది. ఓ జలాంతర్గామి నుంచి జిర్కోన్ మిస్సైల్ ను ప్రయోగించగా, అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. కొత్త తరం ఆయుధ వ్యవస్థల్లో జిర్కోన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణితో పోటీకి వచ్చే ఆయుధం మరొకటి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొంతకాలంగా చెబుతున్నారు. ఈ క్షిపణి పరీక్ష వివరాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది.

గత జులైలో బేరెంట్స్ సముద్రంలో మోహరించిన సెవెరోద్నివిన్స్క్ జలాంతర్గామి నుంచి జిర్కోన్ క్షిపణి ప్రయోగం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఫుటేజిని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హైపర్ సోనిక్ క్షిపణుల వేగం, విన్యాసాలు, అవి ప్రయాణించే ఎత్తు రీత్యా వాటిని గుర్తించడం, అడ్డుకోవడం కష్టమని భావిస్తుంటారు. అయితే, రష్యా అభివృద్ధి చేసిన జిర్కోన్ క్షిపణి హైపర్ సోనిక్ సామర్థ్యంపై పాశ్చాత్య దేశాల నిపుణులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Tsirkon
Hyper Sonic Missile
Russia
Test Fire

More Telugu News