Nobel Prize: వైద్యరంగంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్ లకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్
- మొదలైన నోబెల్ కోలాహలం
- వైద్యరంగంలో పురస్కారం ప్రకటన
- వేడి, స్పర్శ గ్రాహకాల ఆవిష్కరణకు పట్టం
- అమెరికన్ పరిశోధలకు అత్యున్నత అవార్డు
మళ్లీ నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. ఈ ఏడాది వైద్యరంగంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్ లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది.
మానవ మనుగడకు వేడి, చల్లదనం, స్పర్శ జ్ఞానం ఎంతో అవసరం అని తెలిసిందే. ఇవన్నీ ప్రతి మనిషికి ఎంతో సాధారణంగానే లభిస్తాయి. అయితే, ఈ వేడి, చల్లదనం, స్పర్శ తాలూకు జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియాన్ తమ పరిశోధనల ద్వారా తగిన సమాధానం రాబట్టారు.
డేవిడ్ జూలియస్ అమెరికాకు చెందిన వైద్య పరిశోధన రంగ నిపుణుడు కాగా, ఆర్డెమ్ పటాపౌషియన్ మాలిక్యులర్ బయాలజిస్ట్. పటాపౌషియన్ కూడా అమెరికా జాతీయుడే.