Rohit Sharma: ఎటూ తేలని ఐదో టెస్ట్ భవితవ్యం.. ఇంగ్లండ్ తో సిరీస్ ను గెలిచేశామన్న రోహిత్
- 2–1తో తమ సొంతమని హిట్ మ్యాన్ కామెంట్
- ఇంగ్లండ్ సిరీస్ తనకు అత్యుత్తమం కాదని వెల్లడి
- మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందన్న ఓపెనర్
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా.. దానిపై ఇంకా ఎటూ తేల్చలేదు. సిరీస్ లో భారత్ 2–1తో ఆధిక్యంలో ఉంది. అయితే, ఆ సిరీస్ ను తాము గెలిచేశామని రోహిత్ శర్మ అంటున్నాడు. రద్దయిన టెస్ట్ సంగతి తనకు తెలియదని, ఇప్పటికైతే సిరీస్ తమదేనని తేల్చేశాడు.
‘‘వచ్చే ఏడాది ఒక్క టెస్టునే ఆడినా.. నా వరకు మాత్రం మేం 2–1తో సిరీస్ ను గెలిచాం. నా టెస్ట్ కెరీర్ లో ఇంగ్లండ్ పర్యటన మంచి సిరీసే. కాకపోతే నాది అత్యుత్తమ ప్రదర్శన మాత్రం కాదు. ఇంకా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది’’ అని అన్నాడు. టెస్ట్ వరల్డ్ కప్ (డబ్ల్యూటీసీ)కు ముందు సౌథాంప్టన్ లో ఇంగ్లండ్ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నానని చెప్పాడు. టెక్నిక్, ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్టు తెలిపాడు. మున్ముందు కూడా ఇలాగే ఆడతానని స్పష్టం చేశాడు.