Mark Zuckerberg: సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కానీ, అప్పటికే రూ.52,126 కోట్ల నష్టం
- వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంతరాయంతో భారీ నష్టం
- కుబేరుల జాబితాలో ఐదో స్థానానికి పతనం
- అంతకుముందు మూడో స్థానంలో సంస్థ సీఈవో
- 5 శాతం పడిన సంస్థ షేర్ విలువ
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ను వాడుతున్నారు. నిన్న కొన్ని గంటల పాటు అవేవీ పనిచేయకపోయేసరికి చాలా మంది చేతులు తెగినట్టయిపోయింది. కనెక్టివిటీ లేక ఎంతో నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారంపై ఫేస్ బుక్ , వాట్సాప్ లు సారీ చెప్పాయి. కానీ, సంస్థకు అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
ఇవాళ అంతరాయంపై స్పందించిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. క్షమాపణలు తెలియజేశారు. అంతరాయానికి చింతిస్తున్నట్టు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సేవలపై ఎంత ఆధారపడ్డారో తమకు తెలుసని అన్నారు. ఇటు వాట్సాప్ కూడా క్షమాపణలు కోరింది. వాట్సాప్ ను పనిచేయించేందుకు ఎంతో కష్టపడ్డామని, సమస్య తొలగిపోయిందని ట్వీట్ చేసింది. సహనానికి కృతజ్ఞతలు అని తెలిపింది. కాగా, నిన్న రాత్రి 9 నుంచి అవన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అవి తిరిగి వర్కింగ్ కండిషన్ లోకి వచ్చాయి.
కాగా, ఎన్ని సారీలు చెప్పినా సంస్థకు అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. జుకర్ బర్గ్ 700 కోట్ల డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంటే మన కరెన్సీలో ఆయన నష్టం సుమారు రూ.52,126 కోట్లు. కేవలం కొన్ని గంటల అంతరాయంతో ఆయన తన ఆస్తిలో అంత పోగొట్టుకున్నారు. అంతేగాకుండా కుబేరుల జాబితాలో ఆయన మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. 12,160 కోట్ల డాలర్ల సంపద ఉన్న జుకర్ బర్గ్.. బిల్ గేట్స్ తర్వాతి స్థానంలో నిలిచారు.
ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ లలో అంతరాయం కారణంగా చాలా సంస్థలు ప్రకటనలను విరమించుకున్నాయి. దీంతో సంస్థ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి. గత నెల నుంచి ఇప్పటిదాకా సంస్థ షేర్లలో 15 శాతం తగ్గుదల నమోదైంది.