innocent: వారిద్దరూ నౌకలోకి కూడా వెళ్లలేదు.. ముంబై డ్రగ్స్ కేసులో అర్బాజ్ తండ్రి వ్యాఖ్యలు
- ఆరోపణలు నిరాధారమన్న అస్లామ్ మర్చంట్
- వాట్సాప్‌లో డ్రగ్స్ గురించి సంభాషణే లేదని వ్యాఖ్య
- పార్టీకి ఇద్దరూ ఆహ్వానితులని వివరణ
ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మరో ఇద్దరిని ఎన్సీబీ కస్టడికీ అప్పగించారు. ఈ క్రమంలో ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ తండ్రి నోరు విప్పారు. పిల్లలపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. డ్రగ్స్ దొరికిన క్రూయిజ్ నౌకలోకి వారిద్దరూ కనీసం వెళ్లనేలేదని స్పష్టం చేశారు.
నార్కొటిక్స్ బ్యూరో అధికారులు పిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని, ఒక లాయర్‌గా తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అస్లామ్ మర్చంట్ అన్నారు. ఆర్యన్, అర్బాజ్‌లపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. అర్బాజ్, ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరికాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిద్దరూ అసలు నౌకలోకే వెళ్లలేదని, అధికారులకు దొరికిన డ్రగ్స్ మాత్రం నౌకలోనే దొరికాయని అన్నారు.
అలాగే ఆర్యన్, అర్బాజ్ వాట్సాప్ చాట్‌లో డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నారని వచ్చిన వార్తలను కూడా అస్లామ్ ఖండించారు. చివరి నిమిషంలో స్నేహితులిద్దరూ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, దాని గురించే వారిద్దరూ వాట్సాప్‌లో మాట్లాడుకున్నారని చెప్పారు. క్రూయిజ్‌లో జరిగిన పార్టీకి ఆర్యన్, అర్బాజ్ ఇద్దరూ ఆహ్వానితులని, వెళ్లాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడి చివరకు వెళ్లారని వివరించారు.