MAA: బ్యాలెట్ విధానంలోనే ‘మా’ ఎన్నికలు: ఎన్నికల అధికారి కృష్ణమోహన్
- వివరణ ఇచ్చిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నిర్ణయమన్న అధికారి
- ఈవీఎంల ద్వారా జరపాలని లేఖ రాసిన ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని విష్ణు ప్యానెల్ దుర్వినియోగం చేస్తోందంటూ ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. ఆ వెంటనే తమకు ఈవీఎం ఎన్నికలపై నమ్మకం లేదని మంచు విష్ణు ప్రకటించారు. తనకు, తన ప్యానెల్ సభ్యులకు ఈవీఎం ఎన్నికలపై నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని విష్ణు తెలిపారు.
ఈ మేరకు ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణమోహన్ ప్రకటించారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ చేసిన ప్రతిపాదనలను కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపినట్లు కృష్ణమోహన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కాగా, ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓట్లు వేసే వారు ‘మా’కు లేఖ రాసి, ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే విష్ణు ప్యానెల్‌కు చెందిన ఒక వ్యక్తి పలువురి తరఫున ఈ ఫీజు చెల్లించినట్లు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.