Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి: రేవంత్ రెడ్డి డిమాండ్

revanth reddy critisises BJP in regard of Lkhimpur Kheri violence

  • లఖింపూర్‌ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ నేతల ర్యాలీ
  • పాల్గొన్న రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు
  • నిందితులపై మోదీ, యోగి చర్యలు తీసుకోవడం లేదని విమర్శ

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించారు. పీవీమార్గ్‌లో జరిగిన ఈ ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా మల్లు రవి, సీతక్క తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలోని 80 కోట్ల మంది రైతులకు ప్రధాని మోదీ మరణశాసనం రాశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించాడని, ఈ నిందితులపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని రేవంత్ నిప్పులు చెరిగారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని అరెస్టు చేశారని విమర్శించారు.

హింసాకాండ జరిగిన ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దారుణానికి కారకుడైన ఆశిష్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు.  అదే సమయంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News