Rajasthan Royals: కీలక మ్యాచ్‌లో రెచ్చిపోయిన ముంబై.. చిత్తుగా ఓడిన రాజస్థాన్
- రాజస్థాన్‌ను తొలుత 90 పరుగులకే కట్టడి చేసిన ముంబై
- సగం ఓవర్లు కూడా పూర్తికాకముందే లక్ష్యాన్ని ఛేదించిన రోహిత్ సేన
- నాలుగు వికెట్లతో రాజస్థాన్‌ను వణికించిన కౌల్టర్ నైల్
ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చెలరేగింది. తొలుత బంతితో విజృంభించి రాజస్థాన్‌ను 90 పరుగులకే కట్టడి చేసింది. ఆ పై 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయడంతో ముంబై సగం ఓవర్లు కూడా పూర్తికాకముందే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌ను కౌల్టర్ నైల్, నీషమ్ దారుణంగా దెబ్బతీశారు. వారిద్దరి దెబ్బకు రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఏడుగురు ఆటగాళ్లు కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఓపెనర్ లూయిస్ చేసిన 24 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరంటే రాజస్థాన్ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కౌల్టర్ నైల్ నాలుగు, నీషమ్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారీ తేడాతో నెగ్గిన రోహిత్ సేన నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. నిజానికీ మ్యాచ్ ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో ఓడితే నేరుగా ఇంటికి వచ్చేసేది. మరోవైపు, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసినట్టే. ఐపీఎల్‌లో భాగంగా నేటి రాత్రి ఏడున్నర గంటలకు అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి.