Telangana: దసరా వేళ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సౌకర్యం.. నేరుగా కాలనీకే బస్సు!
- కనీసం 30 మంది ఉంటే బస్సును బుక్ చేసుకోవచ్చు
- దసరా వేళ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్ణయం
- ప్రత్యేక బస్సులు, టికెట్ ధరలు, సమయాల కోసం సమాచార కేంద్రాలు
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్రాంతం, లేదంటే ఒకే కాలనీ నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు 30 మంది, అంతకుమించి ఉంటే సమీపంలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకోవచ్చని, అది నేరుగా కాలనీకే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఆర్టీసీ తెలిపింది. నేటి నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
అలాగే, దసరా పండుగను పురస్కరించుకుని నడిపే ప్రత్యేక బస్సులు, వాటి ధరలు, సమయం, ఇతర వివరాల కోసం ఆయా బస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు. ఎంజీబీఎస్‌ను 99592 26257, జూబ్లీ బస్ స్టేషన్‌ను 99592 26264, రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను 99592 26154, కోఠి బస్‌స్టేషన్‌ను 99592 26160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దసరా నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.