NDA: ఆ దుర్ఘటన వీడియోలో కొంత భాగాన్నే మీడియా చూపుతోంది: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఆరోపణ
- లఖింపూర్ ఖీరీ ఘటనపై అజయ్ మిశ్రా స్పందన
- కారులో తన కుమారుడు లేడని వ్యాఖ్య
- ఘటన జరిగిన ప్రాంతంలో ఖలీస్థాన్ పోస్టర్లు కనపడ్డాయని ఆరోపణ
- డ్రైవర్ పై కొందరు దాడి చేయడంతోనే కారు అదుపు తప్పిందని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో రైతులపైకి కారును ఎక్కించిన ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరోసారి స్పందించారు. ఆ ఘటన జరిగిన సమయంలో కారులో తన కుమారుడు లేడని ఆయన చెప్పుకొచ్చారు. రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన వీడియోలో కొంత భాగాన్నే మీడియా చూపుతోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధిష్ఠానం తనకు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు అజయ్ మిశ్రా చెప్పారు. ఆ ఘటన జరిగిన ప్రాంతంలో ఖలీస్థాన్ పోస్టర్లు కనపడ్డాయని ఆరోపించారు. డ్రైవర్ పై కొందరు దాడి చేయడంతోనే ఆ కారు అదుపుతప్పి దూసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. ఆ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందని చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు.